జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు
ఈ అయిదు ప్రదేశాలు ప్రకృతి అద్భుతాలు
ప్రకృతి రమణీయతకు నెలవులు
భారత్‌లో రెండు, విదేశాల్లో మూడు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆతిథ్యం ఇస్తోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడంపై ఈ ఏడాది దృష్టి సారించారు. మానవాళి మనుగడను కాపాడుకునేందుకు యావత్ ప్రపంచం నినదిస్తోంది. జీవులకు అత్యంత కీలకమైన పర్యావరణాన్ని కాపాడుకునే రోజును యావత్ ప్రపంచం సంబురంగా జరుపుకుంది. ఈ క్రమంలో భారత ప్రధాని అమ్మ పేరుతో ఓ మొక్కనాటి సంరక్షిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రత్యేకంగా వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు. ఇక.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ తనదైన రీతిలో మొక్కలను నాటే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, ఇంత గొప్ప మహోత్సవం రోజున మన చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతాలను చూసి ఆనందించే అవకాశాలు ఏమున్నయో తెలుసుకుందాం. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రపంచంలోని ఈ అయిదు అద్భుతమైన ప్రదేశాలను తెలుసుకుందాం..
- మేఘాలయలో జీవన వంతెనలు.. (భారత్)
మేఘాలయ రాష్ట్రంలో ఒక వింతైన, అద్భుతమైన ప్రదేశం ఉంది. అవే జీవన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జెస్). మేఘాలయలోని అందమైన వారసత్వ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ వంతెనలను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. ఈ వంతెనలు సాధారణంగా మనం చూసే వంతెనల్లా కాకుండా, చెట్ల వేర్లతో తయారవుతాయి. అక్కడ నివసించే స్థానిక ప్రజలు శతాబ్దాల తరబడి చెట్ల వేర్లను ఒకదానికొకటి అల్లి, ఈ వంతెనలను నిర్మించారు. ప్రకృతికి, మనిషికి మధ్య ఎంత అద్భుతమైన సంబంధం ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఈ వంతెనలలో చాలా ప్రసిద్ధి చెందినది చిరపుంజిలో ఉన్న డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్‌గా చెప్పుకోవచ్చు.
- పూల లోయ (వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (భారత్)..
ఉత్తరాఖండ్‌లోని చమోలీలో పశ్చిమ హిమాలయాల్లో ఉన్న పూల లోయను UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ పార్క్ ఇటీవలే అంటే జూన్ 1వ తేదీన పర్యాటకుల కోసం రీ ఓపెన్ అయ్యింది. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ వరకు తెరిచి ఉంచుతారు. ఇక్కడ 600కు పైగా రకాల మొక్కలు, పచ్చని దారులు, అద్భుతమైన హిమాలయ దృశ్యాలు ఉన్నాయి. ఇది ట్రెక్కింగ్ చేసేవారికి, ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రఫీ ప్రియులకు మంచి అనుకూల ప్రదేశంగా ఉంటోంది.
అరషియామా బాంబూ గ్రోవ్ (జపాన్):
కైటో శివార్లలో ఉన్న అరషియామా బాంబూ గ్రోవ్ ప్రతి యాత్రికుడు చూడదగిన ప్రదేశం. 1996లో జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఆకుల గలగలలను జపాన్‌లోని టాప్ 100 సౌండ్‌స్కేప్‌లలో ఒకటిగా పేర్కొంది.
- మోంట్ సెయింట్-మిచెల్: (సముద్రం మధ్య అద్భుత ద్వీపం) :
ఫ్రాన్స్‌లో మోంట్ సెయింట్-మిచెల్ అనే ఒక దీవి ఉంది. ఇది సముద్రపు అలల రాకను బట్టి కొన్నిసార్లు సముద్రంలో కలిసిపోయినట్లు ఉంటుంది. మరికొన్నిసార్లు నీటిలోంచి పైకి లేచి నిలబడినట్లు కనిపిస్తుంది. అందుకే దీన్ని “టైడల్ ఐలాండ్” అంటారు. పర్యాటకులకు ఇది చాలా ఇష్టమైన ప్రదేశం. ఈ దీవి చుట్టూ ఎత్తైన, బలమైన గోడలు ఉంటాయి. ఈ గోడల లోపల ఒక అందమైన గ్రామం.. ఒక పెద్ద చర్చి, ఇంకా ఒక పురాతన మఠం (అబ్బే) ఉంటాయి. చూడటానికి ఇదంతా ఒక కోటలా కనిపిస్తుంది. సముద్రంలో అలలు బాగా ఎగసిపడినప్పుడు, ఈ మోంట్ సెయింట్-మిచెల్ కొన్ని గంటలపాటు మళ్లీ దీవిగా మారిపోతుంది. ఆ సమయంలో ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూడాలని చాలా మంది కోరుకుంటారు.
- అజోరెస్: చూడముచ్చటైన పోర్చుగీస్ దీవుల సమూహం
లిస్బన్ తీరానికి దూరంగా ఉన్న అజోరెస్ అనేవి పోర్చుగల్‌కు చెందిన అందమైన దీవుల సమూహం. ఇవి పర్యాటకులను ఆకర్షించే పచ్చని లోయలు, సముద్రపు ఒడ్డున నిటారుగా ఉండే కొండలు, స్వచ్ఛమైన నీలిరంగు జలాలు, అద్భుతమైన జలపాతాలు, ఇంకా కనుల పండుగ చేసే నీలిరంగు హైడ్రేంజియా పూల పొలాలతో అలరారుతాయి. జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ అద్భుతమైన ప్రదేశం ఇది