ఒక్క రోజే లక్షా 30 వేలకు పైగా..

  • కనకదుర్గమ్మ దర్శనానికి పోటీత్తుతున్న భక్తులు…
  • వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..
  • వివిధ రూపాలలో అమ్మవారిని దర్శించుకుంటున్న తీరు…
  • ఆరు రోజుల్లో ఏడు లక్షలకు పైగా భక్తుల రాక…
  • శుక్ర శనివారాల నుండి పెరిగిన రద్దీ..
  • అమ్మ దర్శనానికి సరాసరి రెండు గంటలకు పైగా సమయం..
  • 9 లక్షల లడ్డూలు విక్రయం…
  • లక్షన్నరకు పైగా అమ్మవారి అన్న ప్రసాద స్వీకరణ…
  • లక్షన్నరకు పైగా మంచినీటి బాటిల్ సరఫరా…
  • 30 వేలకు పైగా చిన్నారులకు టాగ్స్..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల 22వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ వారు వివిధ అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. కనకదుర్గమ్మ వారి దర్శనానికి వస్తున్న భక్తుల రాక రోజురోజుకీ పెరుగుతుండడం గడిచిన ఆరు రోజుల్లో సుమారు 7 లక్షలకు పైగా భక్తులు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

రాష్ట్రం నలుమూలలతో పాటు, దేశంలోని పలు ప్రాంతాల నుండి విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం కోసం విజయవాడకు తరలిరావడంతో ఎప్పుడు చూసినా ఇంద్రకీలాద్రి జనకేలాద్రిగా కనిపిస్తోంది. క్యూలైన్లతో పాటు కనకదుర్గ నగర్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నామస్మరణ అనునిత్యం మారుమొగడం, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తోంది.

శుక్రవారం నుండి మరింత పెరిగిన భక్తుల రాక…

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 5వ రోజు శుక్రవారం నుండి కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం వరకు ఐదు రోజులకు గాను 5,3 7,1 71 మంది భక్తులు కనకదుర్గమ్మ వారిని దర్శించుకోగా శనివారం ఒక్క రోజే లక్షా 30 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

అలాగే అమ్మవారి అన్న ప్రసాదాన్ని లక్షన్నరకు పైగా భక్తులు స్వీకరించగా తొమ్మిది లక్షలకు పైగా లడ్డు విక్రయాలు జరిగాయి. సుమారు 13 వేలకు పైగా భక్తులు తమ తలనీలాలను అమ్మవారికి సమర్పించగా, లక్షన్నరకు పైగా వాటర్ బాటిల్స్ ను భక్తులకు సరఫరా చేశారు.

క్యూలైన్లతో పాటు వివిధ ప్రాంతాలలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు 30 వేలకు పైగా చిన్నారులకు టాగ్స్ వేయగా అందులో 151 మంది చిన్నారులను గుర్తించారు. ఇదే సమయంలో తప్పిపోయిన మరో చిన్నారిని టాగ్ సహాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

సోమవారం ఆలయానికి సీఎం చంద్రబాబు..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూలా నక్షత్రం రోజు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ప్రతి ఏటా ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా రాగా ఈ ఏడాది ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సరస్వతి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ వారికి మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పరిశీలించిన అధికారులు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు ప్రారంభించారు. సుమారు 45 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి కొండపై ఉండే పరిస్థితుల్లో సాధారణ భక్తులకు దర్శనాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిని నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

Leave a Reply