16న శ్రీశైలంలో మోదీ పర్యటన
ఎంపీ బైరెడ్డి శబరి ఏర్పాట్లు పరిశీలన
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల అరణ్యంలోని ప్రముఖ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై భూ కైలాసంగా విరాజిళ్లుతున్న శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు ఈ నెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్ పి సునీల్ షేరాన్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యులు మేడా మురళీధర్, రేఖా గౌడ్ లతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.
శ్రీశైలదేవస్థానం ఈ ఓ శ్రీనివాసరావు, తదితర జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ నరేంద్రమోడీ శ్రీశైలం పర్యటనను విజయవంతం చేద్దాం అని కోరారు. ఇప్పటికే అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి శ్రీశైల పర్యటన విజయవంతంపై సమీక్షా చేశారన్నారు.