Mobiles recovery | చోరీకి గురైన మొబైల్స్ రికవరీ
- బాధితులకు అందజేత
Mobiles recovery | బాపట్ల క్రైమ్, ఆంధ్రప్రభ : చోరీకి గురైన మొబైల్ ఫోన్స్‌ను బాపట్ల జిల్లా పోలీస్ అధికారులు రికవరీ చేసి ఈ రోజు ఎస్పీ ఉమామహేశ్వర్ చేతుల మీదుగా బాధితులకు పంపిణీ చేశారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వార్షిక సమావేశంలో మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఫోన్లు పోగొట్టుకున్న కొంతమంది బాధితులకు అందజేశారు.

మిగతా వారికి ఆయా స్టేషన్లలో నమోదైన ఫిర్యాదులను ఆధారంగా వారిని పిలిపించి ఇవ్వటం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో 258 చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రికవరీ చేసిన పోలీస్ అధికారులను ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గడచిన మూడు నెలల్లో సుమారు రూ.75 లక్షలు విలువైన 350 మొబైల్ ఫోన్స్ స్వాధీన పరచుకుని సంబంధిత బాధితులకు అందజేసినట్లు తెలియజేశారు. జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి చోరీకి గురైన 3,301 మొబైల్స్‌ను రికవరీ చేయటం జరిగిందని ఎస్పీ చెప్పారు. సుమారు రూ.7 కోట్లు విలువ ఉంటుందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడమే కాకుండా సీఐఆర్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయాలని అవగాహన కల్పించారు.

