సరిగ్గా ఓటు వేయలేని పట్టభద్రులు, ఉపాధ్యాయులు
బాక్స్‌ల నుంచి పది శాతానికి పైగా చెల్లని ఓట్లు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 27,671 చెల్లని ఓట్లు
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 879 ఫెయిల్
నల్లగొండలో టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 492 వేస్ట్
కరీంనగర్, ఆంధ్రప్రభ : పెద్దల సభకు సభ్యులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం విద్యావంతులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి డిగ్రీ పూర్తయిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ రెండు నియోజకవర్గాల నుంచి చెల్లని ఓట్లు అధికంగా కనిపించడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. వీళ్లు విద్యావంతులా? అని ముక్కు మీద వేళ్లు వేసుకుంటున్నారు. నిజంగా డిగ్రీ పాస్ అయ్యారా? అనే సందేహాలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. అలాగే.. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో 879 చెల్లని ఓట్లున్నాయి. నల్లగొండ-వరంగల్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లోనూ 492 ఓట్లు ఫెయిల్ అయ్యాయి. కొంతమంది ఉపాధ్యాయులు కూడా అవగాహన లోపంతో ఓటేసినట్టు తెలుస్తోంది.
సాధారణ ఓటింగ్ కంటే డిఫారెంట్..
శాసనసభ ఎన్నికల్లో ఈవీఎం వినియోగిస్తుంటారు. కాబట్టి పెద్ద సమస్య లేదు. మండలి ఎన్నికల్లో ఓటింగ్ వేయడం డిఫారెంట్. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న పెన్ను తీసుకుని అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో 1, 2, 3 అంకెలు వేయాలి. ఒకవేళ రోమన్ అంకెలు వేసినా.. బ్యాలెట్‌పై ఏమైనా రాసినా ఆ ఓటు చెల్లదు. ఈ ఓటింగ్ ఎలా వేయాలనేదానిపై అభ్యర్థులు ఒకవైపు, అధికారులు మరోవైపు ప్రచారం చేస్తునే ఉన్నారు.
పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు..
ఈ సారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో గెలుపు బాట పట్టాల్సిన అభ్యర్దుల లెక్కలు తారుమారుకావడంతో తలలు పట్టుకుంటున్నారు. దేశంలో ఎన్నికలను ఓ పండుగలా చూస్తారు. భవిష్యత్తు నిర్మాణానికి మంచి నాయకులను ఎన్నుకోవడం కీలకమని నమ్ముతారు. అందుకే ఊరూ వాడా అందరూ దండుగా కదిలొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులు కూడా ఓటు ఎలా వేయాలో తెలుసుకొని మరీ తమ హక్కు కాపాడుకుంటారు. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేస్తుంటారు. అయితే.. నిరక్షరాస్యులు ఇంత సులువుగా చేసిన పని గ్రాడ్యుయేట్లు చేయలేకపోతున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సరిగ్గా ఓటు వేయకుండా గందరగోళం నెలకొనేలా చేస్తున్నారు. కొందరు బ్యాలెట్ పేపర్ల మీద రైట్ గుర్తుపెట్టగా.. ఇంకొందరు బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేశారు. చెల్లని ఓట్ల ఇష్యూతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లేట్ అవుతోందని సమాచారం. ఫలితాల్లో ఒక్కో ఓటు కీలకమైన నేపథ్యంలో ఏకంగా వేలకు వేలు ఓట్లు చెల్లనివిగా తేలడంతో అభ్యర్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చదువుకున్న వారు ఓటు సరిగ్గా వేయకపోవడం ఏంటి అసలు వీళ్లను ఏమనాలి అంటూ ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3,55,159 ఓట్లకు గాను 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,62,561 మంది పురుషులు కాగా, 87544మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు సుమారు 27,671 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ స్థానంలోనూ మొత్తం 2,41,774 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మొత్తం 26,909 ఓట్లు చెల్లలేదు. ఉభయ గోదావరి జిల్లాల స్థానంలో మొత్తం 2,18,902 ఓట్లు పోలవ్వగా వాటిలో 31, 202 ఓట్లు చెల్లుబాటు కాలేదు.