ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత..

ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత..

18వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

కృష్ణలంక, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని ప్రజలపై పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్‌, రాణిగారి తోట తమ్మిన పోతురాజు వీధి పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్‌లోని ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి రోజూ నియోకవర్గంలో స్వయంగా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సంబందింత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేలా చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ప్రతి శుక్రవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతిప్రతాలను తీసుకుని పరిష్కరిస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.


యుద్ద ప్రభావం రాష్ట్రంలోని ప్రజలపై పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న సమాచారంపై అధికారులతో సమీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో గ్యాస్‌ వినియోగదారులకు ఏవిధమైన ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టామన్నారు. యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను కేంద్ర ప్రభుత్వ సహాకారంతో వారి స్వస్థలాలకు తీసుకురావడానికి కూడా అన్ని చర్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

పార్టీ డివిజన్‌ నాయకులు కొక్కెర తిరుపతయ్య, వేముల దుర్గారావు, మైలమూరు పీరుబాబు, రాయి రంగమ్మ, గోగుల ఏసుబాబు, తలపాటి ప్రసాద్, పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కాసుల శ్రీనివాసరావు, దుర్గమ్మ, గండ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply