MLA | గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- కూర వెంకటరాజిరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
MLA | టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గుమ్మడవెల్లి వేలంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామాలను ఈ ప్రజాపాలనలో అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
గత పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని ప్రజలు చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు. మతం పేరుతో బీజేపీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రలోభాలకు ప్రజలు లొంగబోరని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో నియోజకవర్గంలో 90 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతులకు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు వివరించారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంతాల లక్ష్యమని, గ్రామీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కల వెలంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూర వెంకటరాజిరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

