mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!

mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!
బడ్జెట్ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ సమస్యలపై పూర్తి దృష్టి…
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..
ఆటో కార్మికులు, అంగన్వాడీలు, గృహాలు, రహదారులు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రతిపాదనలు..
అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చిస్తాం..
mla | విజయవాడ,ఆంధ్రప్రభ : నేటి నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీ వేదికను వినియోగిస్తామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కీలక అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. గత సమావేశాల్లో ఆటో కార్మికుల భవనం, భవన నిర్మాణ కార్మికులు, కాలుష్య నియంత్రణ మండలి వంటి అంశాలను సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈసారి కూడా స్పష్టమైన కార్యాచరణతో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లపై విధించిన అన్యాయ జరిమానాలు, ఫిట్‌నెస్ ధ్రువపత్రాల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బొండా తెలిపారు. కాలుష్యరహిత విజయవాడ లక్ష్యంగా సీఎన్‌జీ, విద్యుత్ ఆటోలను ప్రోత్సహించే విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువస్తుందని చెప్పారు. దీనివల్ల ఒకవైపు కాలుష్యం తగ్గుతుందని, మరోవైపు కార్మికుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల పెంపు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం వారి న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, పని భద్రత, గౌరవ వేతనం వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. టిట్కో గృహాలను పూర్తి చేసి ఈ ఏడాది జూలైలోపు లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నగర పరిధిలో కొత్త గృహాల నిర్మాణానికి స్థల సేకరణ, గృహ నిర్మాణానికి బడ్జెట్ పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు అంశాలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామని తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులపై చర్చించి, నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని అన్నారు. రైల్వే వంతెనలు, రోడ్డు వంతెనల పనులను వేగంగా పూర్తి చేయడం, అవసరమైన కొత్త పనులకు బడ్జెట్ కేటాయింపులు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని బొండా స్పష్టం చేశారు. రాబోయే మూడు నెలల్లో విజయవాడ సెంట్రల్ అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్తామని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం రాజకీయ వేదికగా కాకుండా, ప్రజల జీవితాలను మార్చే పరిష్కార వేదికగా మార్చడమే తమ లక్ష్యమని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆటో కార్మికులు, అంగన్వాడీలు, గృహ లబ్ధిదారులు, పెన్షనుదారులు, నగరవాసుల సమస్యలన్నింటినీ సమగ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
