MLA | రహదారుల అభివృద్ధికి రూ.11.22 కోట్లు
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- దాములూరులో షాదీఖానా నిర్మాణానికి శంకుస్థాపన
MLA | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి రూ.11.22 కోట్లు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో రూ.45 లక్షల అంచనా వ్యయంతో డీఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమల్లో కూడా రాజీ పడటం లేదన్నారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు.
మైలవరం నుంచి చంద్రాల వరకు రహదారిని ఇప్పటికే రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తుండగా, నియోజకవర్గం దాటే వరకూ రహదారి పూర్తిగా అభివృద్ధి చేసేందుకు మరో రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనికి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే తాజాగా మంజూరైన రూ.11.22 కోట్ల పంచాయతీ రాజ్ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో 20.149 కిలోమీటర్ల పొడవునా 6 రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

రెడ్డిగూడెం మండలంలోని విజయవాడ-విస్సన్నపేట రోడ్డు నుంచి అన్నేరావుపేట వరకు రోడ్డు అభివృద్ధికి రూ.3.30 కోట్లు, ఎంఎన్‌కే రోడ్డు నుంచి మాధవరం వయా కూనపరాజుపర్వ వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2.64 కోట్లు, విజయవాడ-విసన్నపేట రోడ్డు నుంచి నరుకుళ్లపాడు వరకు రూ.2.20 కోట్లు, మైలవరంలోని ఎంపీపీ కార్యాలయం నుంచి రోడ్డు అభివృద్ధికి రూ.54 లక్షలు, ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో రోడ్డు అభివృద్ధికి రూ.89 లక్షలు, జి.కొండూరు మండలంలోని కవులూరు-శాంతినగర్ రోడ్డు అభివృద్ధికి రూ.1.65 కోట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. షాదీఖానా నిర్మాణానికి నిధులు కేటాయించడంపై ముస్లింలు ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

