Minister | వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Minister | వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
- ఆలయాలకు పోటెత్తిన భక్తులు
- ప్రత్యేక పూజలు చేయించిన మంత్రి వాకిటి శ్రీహరి
Minister | మక్తల్, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నగరేశ్వర స్వామి దేవాలయం(Nagareswara Swamy Temple)లో స్వామి వారు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో తూర్పు ద్వారాన్ని మూసివేసి ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం ఆయా ఆలయాల్లో గంటసేపు భక్తులు క్యూ లైన్(Queue Line) లో నిలబడాల్సి వచ్చింది.

పట్టణంలోని యాదవ్ నగర్ లో వెలసిన అతి పురాతనమైన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహావిష్ణువు (జనార్ధన స్వామి) ఈశ్వరుడు కలసి కొలువైన ఆలయం కావడం విశేషం. జనార్ధన స్వామి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇవ్వగా నగరేశ్వరుడు తూర్పు ద్వారానికి ముఖమై వెలసిన ఈ ఆలయం ఎంతో ప్రాశస్తికి పొందిన ఆలయం కావడంతో వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
అదేవిధంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇవాళ కలిసి రావడంతో శ్రీ నల్లజానమ్మ అమ్మవారి ఆలయాల్లో భక్తులు రద్దీ కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ఆయా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త పి.ప్రాణేశాచారి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు వంశీ కృష్ణ జోషి నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బాల్చేడ్ మల్లికార్జున్, సుకన్య చంద్రశేఖర్, రేణుక నరసింహ, కోళ్ళ వెంకటేష్, సీఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
