Minister | 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్

Minister | 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్
- 26న మీ చేతికి.. మీ భూమి కార్యక్రమం
- మంత్రి అచ్చెన్నాయుడు
Minister | ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితా(22A list)లోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ నెల 26న ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీ చేతికి.. మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఈ రోజు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
నిషేధిత భూముల అంశంపై రైతులు, భూ యజమానులు తమ విజ్ఞాపనలు సమర్పించుకోవచ్చని, రెవెన్యూ అధికారులు(Revenue Officers) వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. జాబితాలోని నిషేధిత భూముల అంశాన్ని ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని, అందుకు అనుగుణంగానే ఈ భూ స్వేచ్ఛ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం భూముల రీ సర్వే పేరిట రికార్డులను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. ఆ గందరగోళాన్ని సరిచేసి, ప్రజల అభ్యంతరాలు స్వీకరించి, భూ రికార్డుల్లో పారదర్శకత పెంచడమే ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యమని వివరించారు.
అర్హత ఉండి గత పాలకుల తప్పిదాల కారణంగా 22ఏ, 22-1ఏ, 22-1బీ, 22-1సీ, 22-1డీ జాబితాల్లో చేరిపోయిన భూముల విషయాలను ఆ రోజు తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి(Minister) పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీఓలు, అన్ని స్థాయిల రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇప్పటికే వీరికి మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.
