AP |విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్ర‌జాద‌ర్భార్

  • బాధితుల నుంచి వినతులు స్వీకరణ
  • జోరువానలోనూ ప్ర‌జాద‌ర్భార్ కొనసాగింపు


విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో తన రెండో రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్ర‌జాద‌ర్భార్ (Praja Darbar) నిర్వహించారు నారా లోకేష్ (Nara Lokesh) . వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

అనాథలా వదిలేశారు, ఆదుకోండి..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ (Degree Colleges Guest Faculty Association) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన భర్త మరణించారని, ఉన్న ముగ్గురు పిల్లలు తనను అనాథలా వదిలేశారని, వృద్ధాప్య పెన్షన్ అందించి ఆదుకోవాలని విశాఖకు చెందిన అవ్వా కాంతం విన్నవించారు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్త మరణించారని, తమ కుటుంబానికి చెందవలసిన ఆస్తిని అత్త, మామ, మరిది అన్యాయంగా కాజేశారని విశాఖకు చెందిన రెడ్లదిన్నె శ్రావణి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆదరణ లేక ఇద్దరు చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు.

విశాఖ లంకలపాలెం (Visakhapatnam Lankalapalem) లోని కోనేరు అభివృద్ధి పనుల్లో రూ.1.20 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 79వ వార్డు కార్పోరేటర్ రౌతు శ్రీనివాస మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

జోరువానలోనూ ఆగని ప్రజాదర్బార్..
విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ జోరువానలోనూ కొనసాగింది. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి పలు సమస్యలపై వినతులు (Requests) ఇచ్చేందుకు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయానికి ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. జోరువానలోనూ ప్రజాదర్బార్ ను కొనసాగించిన మంత్రి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చివరి వ్యక్తి వరకు కలిసి అందరితో ఫోటోలు దిగారు.

Leave a Reply