హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం

హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం

ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి టీ,జీ భరత్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు నగరంలోని ఏ–క్యాంప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.


14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగపడే హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా రూ.4 వేల వరకు ఖర్చు అయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. ఈ టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన బాలికలు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిని కోరారు. అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత 96 శాతం విజయశాతం కలిగిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.


గత నెల 28న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. జిల్లాలో దాదాపు 30 వేల మందికి ఈ టీకా వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అవసరమైన టీకాలు, మందులను సమయానికి తీసుకోవడం అవసరమని అన్నారు. కోవిడ్-19 సమయంలో రోగ నిరోధక శక్తి కోసం ప్రజలు టీకాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం తీసుకొచ్చిన ఈ టీకాను సరైన వయస్సులో బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.


జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఈ టీకా ఒక్క డోస్ మాత్రమే వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ టీకాను పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అర్హులైన బాలికలకు ఉచితంగా వేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో దాదాపు 30 వేల మందికి టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమ, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply