Minister | ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..

Minister | ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి..

  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • రూ.3కోట్లతో ప్రొటక్షన్ వాల్ పనులకు శంకుస్థాపన
  • మహిళలకు సంక్రాంతి సారె, వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ

Minister | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో రూ.3 కోట్ల వ్యయంతో ప్రొటెక్షన్ వాల్ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఎస్పీ సంకీర్త్ లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

Minister

ఎమ్మెల్యే జీఎస్సార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని 26వ వార్డు, టీ-2 క్వార్టర్స్, 5,6,7, కృష్ణ కాలనీలో అడవి జంతువుల బెడద ఉందని ప్రజల భద్రత దృష్ట్యా ప్రొటెక్షన్ వాల్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక గౌరవం ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 48 గంటల్లోనే ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు అందజేశామని, పట్టణాల్లో మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సంక్రాంతి సారె అందజేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

మహిళలకు వడ్డీ రుణాలు అందజేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలోని కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూంల‌ను ఊరించి ఎవ‌రికీ ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గత పదేళ్లుగా రేషన్ కార్డు లేక నిరుపేదలు ఇబ్బందులు పడ్డారని తాము అర్హుడైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించామని, ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఈ ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ ఇంటికి 200 ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మున్సిపాలిటీలు, దేవాలయాలు అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

గత రెండేళ్లుగా ఆర్టీసీ బస్సు కొనలేదని మహిళా సంఘాలే 3200 బస్సులు ఆర్టీసీలో నడిపిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు భూపాలపల్లి అభివృద్ధికి తనవంతు నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాల పరంపర కొనసాగుతుందని, గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాలు పొందిన అధికారులు ఈ వేదికపై ఉన్నారని గుర్తు చేశారు. మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ఆశీర్వదించిన ప్రజల కోసం నిజాయితీగా సేవకుడిగా పని చేస్తున్నాను అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో మౌలిక సమస్యల పరిష్కారానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నానన్నారు. సందర్భంగా 30 వార్డుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు కలెక్టర్ వివరించారు. అనంతరం రూ. కోటి విలువ చేసే బ్యాంకు రుణాల చెక్కును, రూ.19 లక్షల విలువ చేసే వడ్డీ లేని రుణాల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. అదేవిధంగా పట్టణ మహిళలకు సంక్రాంతి సారే అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డీఆర్డీవో పీడీ బాలకృష్ణ , ఆర్డీవో హరికృష్ణ, అదనపు ఎస్పీ నరేష్ కుమార్ , తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తరుణ్ ప్రసాద్, డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఆర్టీఐ మెంబర్ రామచంద్రయ్య, నాయకులు దేవన్, బుర్ర కొమురయ్య, మధు, పిప్పాల రాజేందర్, అప్పం కిషన్, దాట్ల శ్రీనివాస్, సాంబమూర్తి, అనిల్, రవీందర్, తోట రంజిత్, వెంకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply