Mini Medaram | జాతరపై నిర్లక్ష్యం నీడలు..

Mini Medaram | జాతరపై నిర్లక్ష్యం నీడలు..
- పట్టించుకోని పాలకులు, అధికారులు..
Mini Medaram | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, కాల్వపల్లి గ్రామాల శివారు పూరేడు గుట్ట సమ్మక్క- సారాలమ్మ మినీ మేడారం జాతర అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య నీడలో వసతుల కల్పనలో వెనుకబడింది. పది రోజుల్లో జాతర ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 28 నుండి31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగనుంది.

కాగా పూరేడు గుట్ట మినీ మేడారం జాతరకు నేటికీ జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. జాతర అభివృద్ధి పనులు విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, స్నాన ఘట్టాల్లో జాతర ప్రాంగణ శుభ్రత, రోడ్డు మరమ్మత్తుల కోసం పనులు చేపట్టవలసి ఉండగా… నామమాత్రంగా పనులు జరుగుతున్నట్లు భక్తులు తెలిపారు.

నిర్లక్ష్య ధోరణితో ఉత్సవ కమిటీ ఏర్పాటు, అభివృద్ధి నిధులు మంజూరు కాకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. మేడారం సమ్మక్క జాతరను తలపించేలా పురేడు గుట్ట జాతర ఎంతో అంగరంగ వైభవంగా, మానేరు వాగు, చుట్టూ పూరేడు గుట్టలతో హాల్లాదకరమైన వాతావరణంలో మొక్కులు చెల్లించేందుకు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకొంటారని పేర్కొన్నారు.
గత రెండేళ్ల క్రితం జాతర కోసం రూ 30 లక్షలతో అభివృద్ధి పనులు జరగగా, నేడు ఏలాంటి నిధులు, ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి, పూరేడు గుట్ట జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
