Mercy Killing | ఆ ఖాకీ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం – చచ్చిపోతాం అనుమతివ్వండి..
ఆత్మహత్యకు సిద్ధపడ్డ వృద్ధ దపంతులు!
అనుమతి ఇవ్వాలని ఫ్లెక్సీ ద్వారా ప్రభుత్వానికి వినతి
దారి మూసివేయడంతో సాగు చేసుకోని వైనం
ఉపాధి కోల్పోయిన వృద్ధులు
రెండేళ్ల కిందట ఆర్డీఓ దర్యాప్తు
బండి బాట విడిచిపెట్టాలని సూచన
మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : తమకు ఉన్న 12 ఎకరాల భూమికి దారి మూసివేయడంతో రెండేళ్లుగా సాగు చేసుకోలేకపోతున్నామని, ఇంత భూమి ఉన్నా ఉపాధి కోల్పోయామని ఆవేదనతో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫ్లెక్సీ ప్రదర్శన చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. సోమవారం భూపాలపల్లి కలెక్టర్‌లోని ప్రజావాణిలో తమ గోడు వినిపించుకోవడానికి ఫ్లెక్సీతో ఆ దంపతులు వెళ్లారు. అయితే కలెక్టర్ కూడా లేకపోవడంతో వారు తమ నిరసన ఫ్లెక్సీ ద్వారా వెళ్లబుచ్చుకుని సొంత గ్రామానికి చేరారు.
ఇదీ సమస్య…
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేశ్, ఆయన సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని, అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయమై స్థానిక అధికారులు చుట్టూ తిరిగిన ఆ దంపతులు హైదరాబాద్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. ఎస్సై వెంకటేశ్ వేధింపులు భరించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్ల కిందట ఆర్డీఓ దర్యాప్తు
హైదరాబాద్‌లోని వృద్ధ దంపతులు ఫిర్యాదు మేరకు ఆర్డీఓ రమాదేవి విచారణ చేపట్టారు. 2023 డిసెంబర్ 18,27 తేదీల్లో ఆమె బహిరంగ విచారణ నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్న రైతుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. సర్వే నెంబరు 296, 298ల్లో బండ బాట ఉందని, ఆ దారి మూయకూడదని అప్పట్లో ఆర్డీఓ కూడా చెప్పారు. అయినా మూసివేసిన దారిని మాత్రం తొలగించలేదు. ఆ వృద్ధ దంపతులు అటు తహసీల్దార్, ఇటు పోలీసులు చుట్టూ తిరిగినా ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు.