బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవలు..

బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవలు..
- పేదల కోసమే సంజీవిని..
- ఇంటి వద్దనే చికిత్స — సీఎం చంద్రబాబు
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : “బిల్ గేట్స్ సహకారంతో ‘సంజీవిని’ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. రోగులకు ఇంటి వద్దనే చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర్ కంటి ఆసుపత్రి నూతన భవనం, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రతి మనిషికి ఆరోగ్యం.. ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత. నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులతో భాగస్వామ్యం చేస్తోంది” అని సీఎం తెలిపారు.
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులతో నడుస్తున్న ఈ ఆసుపత్రి పేదలకు ఉచిత కంటి చికిత్స అందించడంలో విశేష సేవలు అందిస్తోందని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
అసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించిన చంద్రబాబు, నూతన సూపర్ స్పెషాలిటీ విభాగంలో లభ్యమయ్యే లేజర్ చికిత్సలు, రెటినా సర్జరీలు, కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అధునాతన సౌకర్యాలను పరిశీలించారు. 100 పడకల సామర్థ్యంతో రూపొందిన ఈ భవనం రోజుకు వందలాది మంది రోగులకు సేవలందించగలదని పేర్కొన్నారు.
శంకర్ ఐ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం 30,000 కంటి పరీక్షలు, సర్జరీలు నిర్వహించడమే కాకుండా ఐ బ్యాంక్ ద్వారా కార్నియా దానాలను ప్రోత్సహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ, ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఆర్.వి. రమణి, కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర రావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కలెక్టర్ తనీం అల్సరియా, ఆసుపత్రి డైరెక్టర్లు మురళీకృష్ణ, జెకె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
