Media conference | సిట్ పేరిట కుట్రలు..

Media conference | సిట్ పేరిట కుట్రలు..
- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
Media conference | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసమే సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పై వేధింపులను ధారావాహిక సీరియల్ తరహాలో రెండేళ్ల నుండి కొనసాగుతున్నది.. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నాడని మండిపడ్డారు.
అలీబాబా 40 దొంగలు, దండుపాళ్యం ముఠాల తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు.బొగ్గు స్కాం, 9 వేల ఎకరాల భూ స్కామ్, ఇలా అనేక స్కాం లు చేశారని.. వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం పోలీసు శాఖ సమాచారం సేకరిస్తుంది.
ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. మహానేత, తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్‌ను వేధించడం అప్రజాస్వామికమన్నారు. 14 ఏండ్లు మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ తేవడమే కేసీఆర్ చేసిన నేరమా.. ? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు, కొండా సురేఖ, సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెళ్లికి వెళ్లి ఆహ్వానిస్తారు.. కానీ పోలీస్ అధికారులు నందినగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారని.. ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతీకార వాంఛతో పనిచేస్తున్నారన్నారు.
