Meanings of 15| వీటి పరమార్థమేమిటో తెలుసా..?

Meanings of 15 వీటి పరమార్థమేమిటో తెలుసా..?
పూజ… పూర్వజన్మ వాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.
అర్చన… అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం… అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆచరించేది. పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం. ఇది జీవుణ్ణి, దేవుణ్ణి చేస్తుందని నమ్మకం.
స్తోత్రం… నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం… ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేసేది.

దీక్ష… దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేకం… అభిషేకం చేస్తే, చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరాతత్వాన్ని అందిస్తుంది.
మంత్రం… తత్త్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తినీ ఇస్తుంది.
ఆసనం… ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం… పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం… గంధంలో సర్వ దేవతలు కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు ‘మీరు గంధంలో కొలువై ఉందురుగాక!’ అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.
అక్షింతలు… కల్మషాల ను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.
పుష్పం… పుణ్యాన్ని వృ ద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది. అలా గే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి. మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.
ధూపం… చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. భూత, ప్రేత, పిశాచాలు పారిపోతాయి.
దీపం… సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం.
–దండంరాజు రాంచందర్ రావు
