- ఇంధన కొరతతో మేడే కాల్
- బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్
గువహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకున్నా, తాజాగా వెలుగులోకి వచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంధనం అసాధారణంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించిన పైలట్, అప్రమత్తతతో వెంటనే ‘మేడే’ కాల్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం అందించారు.
విమానంలో 100కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పైలట్ నుంచి అత్యవసర పరిస్థితి సమాచారం అందుకున్న ఏటీసీ అధికారులు, సమీపంలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు సిద్ధం చేశారు.
పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనా, ఎటువంటి ప్రమాదం లేకుండా అందరూ క్షేమంగా బయటపడటం ఊపిరి పీల్చే పరిస్థితిని తీసుకొచ్చింది.
ఈ ఘటనపై ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇంధన లెవల్స్‌పై ముందస్తు తనిఖీల్లో ఏమి జరిగిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇండిగో సంస్థ కూడా అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం.
విమానయాన రంగంలో ‘మేడే’ కాల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినిపించే అత్యంత గంభీరమైన సంకేతం. విమానం ప్రమాదంలో ఉందని, తక్షణ సహాయం అవసరమని ఈ సందేశం ద్వారా పైలట్లు ATCకి తెలియజేస్తారు. ఈ సందర్భంలో మేడే కాల్ ద్వారా ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించిన పైలట్‌కు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.