జన్నారం రూరల్, ఏప్రిల్ 11 (ఆంధ్రప్రభ): హనుమాన్ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలపై ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విగ్రహం పునః ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో పూజారులచే ఎమ్మెల్యే బొజ్జు, ఖానాపూర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భుక్య జాన్సన్ నాయక్, ప్రముఖ కాంట్రాక్టర్ మాదాడి పూర్ణచందర్, గ్రామ పూర్వికుడు భూముల రామచందర్ కుమారుడు యుఎస్ఎ వాసి బి.రంజిత్ కుమార్ దంపతులు, గ్రామ పెద్దల దంపతులు వేరువేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హనుమాన్ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ప్రజలపై ఉంచుతూ ప్రజలను సుఖసంతోషాలతో ఉంచాలన్నారు. పాడిపంటలు బాగుండి.. ప్రజలు ఆయురారోగ్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆనందంగా ఉండేలా ఆ భగవంతుడు కాపాడాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.