Encouter | ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి

  • ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం
  • మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు
  • వైద్య స‌హాయం కోసం హెలికాప్ట‌ర్ రాక‌
  • మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశం
  • బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో ఘటన
  • ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • త‌ప్పించుకున్న న‌క్స‌ల్స్ కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్‌

ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్:

చత్తీస్‌గ‌ఢ్‌ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు, ఆపరేషన్ కగార్ బృందాల మధ్య ఆదివారం ఉద‌యం నుంచి జ‌రుగుతున్న భీకర ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చ‌నిపోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక మావోయిస్టులూ పెద్ద సంఖ్య గాయపడి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. గాయ‌ప‌డ్డ వారిని హెలీకాప్ట‌ర్ ద్వారా త‌ర‌లించి ట్రీట్‌మెంట్ అందించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు.

మావోయిస్టుల భేటీపై స‌మాచారంతో..

పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్న‌ట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ బలగాలు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో కూంబింగ్ దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత 12 మంది మావోయిస్టులు నేల‌కొరిగారు. నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మరణించారు. జగదల్‌పూర్ నుంచి రప్పించిన ఎంఐ 17 హెలికాప్టర్‌లో చావు బతుకుల్లోని సైనికులను తరలించారు. ఇక బస్తర్‌ రేంజ్‌లో భద్రతా దళాలు జల్లెడ ప‌డుతున్నాయి. మావోయిస్టుల కోసం వేటాడుతున్నాయి. మరో వైపు ఎదురు కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది.

మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. రెండు నెల‌ల్లోనే 61 మంది మృతి..

కొత్త ఏడాదిలో మావోయిస్టుల ఏరివేత చురుగ్గా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. జనవరి 5వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌, అదే నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఇక జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు చనిపోయారు. జనవరి 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది హతమయ్యారు. జనవరి 29న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చనిపోయారు. ఫిబ్రవరి 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు ప్రాణాలు వదిలారు. తాజా ఎదురు కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎన్‌కౌంటర్‌తో కలిపి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 61మంది మావోయిస్టులు హతమయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *