Markook | మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం చేయాలి..

Markook | మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం చేయాలి..

  • గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ అసెంబ్లీలో గొంతెత్తాలి
  • డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

Markook | మర్కుక్, ఆంధ్రప్రభ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ముప్పు గ్రామాల ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ తీసుకోవాలని సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్దకు మల్లన్న సాగర్ ముప్పు గ్రామాల బాధితులతో కలిసి వినతిపత్రం అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లారు. అయితే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో అక్కడే కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. అనంతరం కేసీఆర్ పీఏకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ… మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో భూములు, ఇళ్లు కోల్పోయిన గ్రామాల ప్రజలు నేటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి పరిహారం చెల్లించకపోవడం, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, భూముల మార్కెట్ విలువకు తగిన నష్టపరిహారం ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముప్పు గ్రామాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధ్యతగా వ్యవహరించాలని, బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా చర్చించి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం తగదని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సారెడ్డి మాట్లాడుతూ… మల్లన్న సాగర్ బాధితుల సమస్యలు రాజకీయ కోణానికి పరిమితం కావని, ఇది మానవీయ సమస్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి వెంట నిలబడుతుందని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మల్లన్న సాగర్ ముప్పు గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply