Maredumilli | బంధువుల రోదన..

  • ఆసుపత్రిలో పడిగాపులు
  • మావోయిస్టుల పోస్ట్‌మార్టంలో వైద్యులు బిజీబిజీ
  • మా అన్న మృతదేహాన్ని అప్పగించండి – మోటూరి మధు సూధన్‌

రంపచోడవరం/మారేడుమిల్లి, (ఆంధ్రప్రభ) : రంపచోడవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడవుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిమిత్తం ఉంచారు. ఈ మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేందకు ప్రత్యేక వైద్య బృందాలు సైతం వచ్చాయి.

ఈ క్రమంలోనే మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలు దాటిన తరువాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించి చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా పూవర్తి గ్రామానికి తరలించారు. ఇది ఇలా ఉంటే ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ఇంకా 11 మంది మావోయిస్టుల మృతదేహాలు రంప ఏరియా ఆసుపత్రిలోనే ఉన్నాయి. గురువారం మరో ఇద్దరు మావోయిస్టు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందేకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

గురువారం రాత్రి ఏ సమయంలోనైనా టెక్‌ శంకర్‌, కమల్‌ మృతదేహాలను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మరో 9 మావోయిస్టు మృతదేహాలను మాత్రం శుక్రవారం అప్పగించేందకు పోలీసులు ప్రణాళికలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యుల డీఏన్‌ఏ నమూనాలు తీసుకొని వారితో సరిపోలితేనే ఆ మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేందకు పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే వైద్యం బృందం డీఏన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మా అన్న మృతదేహాన్ని అప్పగించండి

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మోటూరి జోగారావు అలియాస్‌ -టె-క్‌ శంకర్‌ మృతదేహాన్ని అప్పగించాలని తమ్ముడు మోటూరి మాధసుధన్‌ అన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ పోలీసుల ఎదురుకాల్పుల్లో తన అన్న మృతి చెందాడని తమకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి రంపచోడవరం చేరుకొని తన అన్న మృతదేహాన్ని చూడాలని వచ్చినట్లు- ఆయన తెలిపారు. తన అన్న ముఖాన్ని ఇప్పటి వరకు చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వెంటనే తమకు అప్పగించాలని కన్నీరు మున్నీరయ్యారు.

Leave a Reply