Maoist | తెలంగాణలోనూ.. లొంగుబాటా..!

Maoist | తెలంగాణలోనూ.. లొంగుబాటా..!
- 40మంది మావోయిస్టులు సిద్ధం
- కొన్ని గంటల్లో డీజీపీ ఎదుట హాజరు…
Maoist | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మావోయిస్టు పార్టీకి (Maoist Party) భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరిలో పలువురు అగ్రనాయకులు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని గంటల సమయం పట్టవచ్చు. శుక్రవారం 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు అగ్రనాయకులు ఉన్నారని సమాచారం. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం ప్రెస్ మీట్ ద్వారా పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
అయితే, రాష్ట్రంలో మావోయిస్టు చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు కాదు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో (Encounter) మరణించారు. ఆ ప్రభావంతో మిగిలిన వారు తమ క్యాడర్‌లతో పెద్దఎత్తున లొంగిపోతున్నారు. ప్రజల మద్దతు తగ్గిపోవడం, పార్టీ నెట్‌వర్క్ నిర్వీర్యమవడం, అనారోగ్య సమస్యలు, ఎన్‌కౌంటర్ల భయం, సిద్ధాంతపరమైన విభేదాలు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలు. ఈ ఘటనలు మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలినట్లు చూపిస్తున్నాయి.
ఛత్తీస్ గఢ్ తో పాటు ఇటు తెలంగాణలోనూ (Telangana) ఈ మధ్యకాలంలో పలువురు నేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. నవంబర్ నెలాఖరులో.. ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతంలో.. 2021 సెప్టెంబరులో 52 మంది, ఈ ఏడాది మార్చి 15న 64 మంది, ఏప్రిల్ 5న 86 మంది, మే 9న 38 మంది లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డుతోపాటు పునరావాస పథకం కింద ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.
