మామిడి రైతులు గగ్గోలు

  • ఫ్యాక్టరీలు ఎగనామం
  • సబ్బిడీకి శఠగోపం
  • 14న రైతుల ఆకంద్రన సభ
  • బంగారు పాళెం సన్నద్ధం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా చరిత్రలోనే తొలిసారిగా బిల్లుల కోసం మామిడి రైతులు(Mango farmers) ఆందోళన బాట పట్టారు. సాధారణంగా ఫ్యాక్టరీలకు మామిడికాయలు తోలిన 15 నుంచి – 20 రోజులలో బిల్లులు చెల్లిస్తారు. ఈ ఏడాది ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మామిడి ఫ్యాక్టరీలు బిల్లులు చెల్లించలే రాష్ట్ర ప్రభుత్వం(state government) ప్రకటించిన నాలుగు రూపాయల మద్దతు ధర కూడా రైతులకు ఇప్పటి వరకు అందలేదు.

గత నెలలోనే మామిడి రైతులకు సబ్సిడీ చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. బిల్లుల అందకపోవడంతో మామిడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. మామిడి తోటల సంరక్షణ కూడా రైతులకు భారంగా మారింది. దీంతో రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

మామిడి సీజన్ ఈ ఏదాది అష్ట కష్టాలతో ముగిసింది. ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సీజన్ లో పడినన్ని కష్టాలు మామిడి రైతులు ఎప్పుడు పడలేదు. మామిడి కాయలు ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 3.30 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు(factories, ramps) సరఫరా చేశారు. 41,235 మంది రైతులు ఈ మామిడికాయలను సరఫరా చేశారు.

మామిడి సీజన్ పూర్తయిన ఇప్పటివరకు మామిడి రైతులకు బిల్లులు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు రైతుల నుంచి మామిడిని తీసుకున్న15 రోజుల తర్వాత బిల్లులను చెల్లించేవారు. ఈ సంవత్సరం చాలా ఫ్యాక్టరీల్లో ఇప్పటివరకు రైతులకు చెల్లింపులు ప్రారంభం కాలేదు.

మామిడి గుజ్జు పరిశ్రమల్లో పేరుకుపోయిన పల్ప్ నిల్వల కారణంగా రైతులకు చెల్లింపులు చేయలేకపోతున్నామని ఫ్యాక్టరీ యజమానులు అంటున్నారు. జిల్లాలో మామిడి పల్ప్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. విదేశాలకు కూడా ఎగుమతులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయల మద్దతు ధరను ప్రకటించారు. ఈ మద్దతు ధర కూడా ఇప్పటివరకు రైతులకు అందలేదు. ఫ్యాక్టరీలకు మామిడిని సరఫరా చేసినప్పుడు ఉద్యానవన శాఖ(horticulture department), వ్యవసాయ శాఖ అధికారులు ఆ రైతులకు సంబంధించిన ఇన్వాయిస్, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్లను తీసుకున్నారు.

దీని ప్రకారం రైతులకు ఫ్యాక్టరీ సరఫరా చేసిన మామిడికి నాలుగు రూపాయల వంతున రైతుల ఖాతాలలో జమ చేయడానికి కసరత్తు చేశారు. ఈ కసరత్తు నెల కిందటే పూర్తయింది. మామిడి రైతుల వివరాలను గ్రామ సచివాలయాలు వారిగా నోటీసు బోర్డుల(notice boards)లో ప్రకటించారు. రైతులు తమ పేర్లను సరిచూసుకొని పేర్లు, లేకున్నా, తప్పులు ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు.

ఆగస్టు నెల నుంచి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయల మద్దతు ధరను వాళ్ల బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ(agriculture department) అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రూ.4.00 సబ్సిడీ మొత్తం రూ.150 కోట్లు రైతులు ఖాతాలకు జమ చేస్తామన్నారు.

జూన్ నెల వరకు సేకరించిన మామిడికి సంబంధించి సబ్సిడీ జూలై నెలలో, అలాగే జూలై నెలలో సేకరిస్తున్న మామిడికి సంబంధించి సబ్సిడీ ఆగస్టు నెలలో రైతులు ఖాతాలోకి జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు( August) ఒకటో తేదీ లోపు అన్ని రికార్డులు నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. రైతుల బ్యాంకుల ఖాతాల వివరాలు, ఐఎఫ్ ఎస్ సి కోడ్, ఈ క్రాప్ పంటలను పరిశీలించాలని తెలిపారు.

మామిడి రైతుల సంక్షేమ సంఘం తరఫున ప్రతినిధులు పలుమార్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 12ల మద్దతు ధర అమలు జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. తొందరగా బిల్లులు చెల్లించాలని మనవి చేశారు. జూలై 22న ప్రపంచ మామిడి దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న చిత్తూరు, పూతలపట్టు(Puthalapattu) శాసనసభ్యులు రైతులకు రూ.12 ల వంతున బిల్లులు చెల్లించే విధంగా చర్యలు కుంటామని హామీ ఇచ్చారు.

ఆగస్టు 13వ తారీఖున చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారుగా 30 వేల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు అనధికారులు కుప్పంకు రానున్నముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి కుదరలేదు. పలు జపాలుగా జిల్లా అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. గత నెల 15వ తారీఖున చిత్తూరు పట్టణంలో భారీ ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

జిల్లా కలెక్టర్(district collector) స్పందించి గత నెల 25వ తారీకు లోపు బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు కిలోకి 8 రూపాయల చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిలో ఏది కూడా కార్యరూపం దాల్చలేదు.

ఈనెల 14న బంగారుపాళెంలో రైతులు మామిడి రైతుల ఆక్రందన సభను జరపనున్నారు. బంగారు పాళెం మార్కెట్ యార్డ్ లో జరిగే ఈ సమావేశానికి అఖిలపక్ష నాయకులను ఆహ్వానించారు. సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు విజయనంద రెడ్డి(Vijayananda Reddy), బంగారు పాల్యం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు, భారత చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్, జనసేన నేత కవితను ఈ ఆక్రందన సభకు ఆహ్వానించారు.

Leave a Reply