మంగళగిరి టిడ్కో ఇళ్లల్లో సమస్యలపై ఆరా

మంగళగిరి టిడ్కో ఇళ్లల్లో సమస్యలపై ఆరా

  • ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేత

గుంటూరు, ఆంధ్రప్రభ : ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏవన్నా ఇబ్బందులుంటే చెప్పండి, వర్షాకాలం జాగ్రత్త.. మరగ కాచిన నీళ్లు తాగండి అని పెన్షన్ లబ్ధిదారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్(District Collector A Tamim) అన్సారియా మాటా మంతీ పంచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో టిడ్కో కాలనీ(Tidco Colony)లో ఎన్టీఆర్ భరోసా పించన్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్.టి.ఆర్ భరోసా(NTR Bharosa) పించన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారుల(Pensioners)కు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా(MEPMA), మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులు, సిబ్బంది ఇందులో నిమగ్నం అయ్యారని తెలిపారు.

మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174., వితంతువులు 70,112., చేనేతకారులు 3,862., గీతకార్మికులు 443., మత్స్యకారులు 570., ఒంటరి మహిళలు 11,330., చర్మకారులు 876., హిజ్రాలు 67., హెచ్.ఐ.వి బాధితులు 2,614., కళాకారులు 77., డప్పు కళాకారులు 854., దివ్యాంగులు 24,835., వైద్య సంబంధిత పింఛనుదారులు 1667., సైనిక సంక్షేమం 28., అభయహస్తం 3,994., అమరావతి భూముల సంబంధిత 17,401 పింఛన్లు పంపిణీ(Distribution of Pensions) జరుగుతుందన్నారు.

బుధవారం ఉదయం నుండి పంపిణీ చేస్తారని, బుధవారం తీసుకోని లబ్ధిదారులకు శుక్రవారం అందజేస్తారని ఆమె చెప్పారు. ముఖాముఖిలో భాగంగా స్థానికంగా మౌలికసదుపాయాలు కొరత ఉందని, మురుగు నీరు రహదారులపై నిలువ ఉంటుందని, కుక్కలు బెడద ఉందని స్థానికులు తెలియజేయగా సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్(GST – Super Savings) పై ప్రజల్లో అవగాహన, అధికారులు నిర్వహిస్తున్నకార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

వర్షాకాలం ప్రభావం వలన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply