- అలిగి..ఆలి ఆత్మహత్య
- ఆరుమాసాలకే పెళ్లి పెటాకులు
(ఆంధ్ర్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : ఊరు కానీ ఊరు… రాష్ట్రం కానీ రాష్ట్రం… చదువు లేదు. సంధ్య లేదు. జీవితం… గుడిసె బతుకులు. కూలీనాలీ పనితోనే పిడికెడు మెతుకులు. తెలిసీ, తెలియని ప్రాయంలోనే పెళ్లి. కొత్తకాపురం. రాష్ట్రం దాటి వచ్చారు. బొగ్గు బట్టీలో చమటోడ్చి బతుకు బండిలో పయనిస్తున్న.. ఓ యువ జంటను విధి కాటేసింది. క్షణికావేశం తో కొత్త ఇల్లాలు ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది.
ఇంతకీ భార్యభర్తల మధ్య గొడవేంటో.. తెలుసా..? సెల్ ఫోన్. గుడిసెలో ఉంటున్న తన కాలక్షేపానికి ఫోన్ (Phone) కావాలని కోరిన భార్యకు భర్త ఇవ్వలేదు. ఈ వీరిద్దరి మధ్య ఈ గొడవ ఆత్మహత్యకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (Maharashtra) పూణె జిల్లా శివానీ తాలూక, కాటేకాడి గ్రామానికి చెందిన నీమా కట్కర్ (Neema Katkar) కు మహారాష్ట్ర , గీత సుధాగడ్ జిల్లా నడోసూరి గ్రామానికి చెందిన రమేష్ సుధీర్ కట్కర్ (Ramesh Sudhir Katkar) కుటుంబాలు పది నెలల కిందట బతుకుతెరువు కోసం ముదిగుబ్బ మండలం యాకర్ల కుంట్ల పల్లికి పది నెలల కిందట వచ్చారు.
ఆరు మాసాల కిందటే.. రమేష్, నీమా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇక్కడే బొగ్గు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య భర్తలు (husband and wife) అన్యోన్యంగానే కాపురం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో బొగ్గు కాల్చే పనికి కిలోమీటర్ దూరంలోని ముక్తాపురం తండా కి వెళ్లి వస్తానని రమేష్ సుధీర్ కట్కర్ (Ramesh Sudhir Katkar) తన భార్యకు చెప్పాడు. తనకు సెల్ ఫోన్ ఇవ్వాలని ఆమె కోరింది. ఇక్కడ కరెంటు లేదు.. చార్జింగ్ అయిపోతే కష్టంగా ఉంటుంది అన్నాడట. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి నీవు వంట చెయ్యి మధ్యాహ్నం వచ్చి తింటానని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు.
12 :30 గంటలకు దగ్గరలోనే ఉన్న అత్త మామ గుడిసె వద్దకు వెళ్లి, చూడగా కోడలు నీమా కనిపించలేదు. మంచినీళ్ల కోసం వెళ్లిందేమోనని చుట్టుపక్కల వెతికారు. పక్కనే నాగభూషణం అనే వ్యక్తి మామిడి తోటలో చున్నీతో ఉరికి వేలాడుతూ నీమా (Neema) కనిపించింది. దీంతో మృతురాలి అత్త భయపడి వెంటనే తన కొడుకు కమేష్ కు, విష్ణుమూర్తి రామ్ జాదవ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న బంధువులు మృతదేహాన్ని దించి, తమ గుడారం వద్దకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.