Malakpet | పాత బ‌స్తీలో భారీ చోరీ..

  • రూ.50 లక్షల నగదు,
  • 30 తులాల బంగారం అపహరణ

ఆంధ్ర‌ప్ర‌భ : మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్తీ ప్రాంతంలో భారీ చోరీ చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. మానస రెసిడెన్స్‌లో నివాసం ఉంటున్న రమణ ఇంటిని గుర్తు తెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని అదునుగా చేసుకుని, దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఈ చోరీలో దుండగులు దాదాపు రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం నగలు, 40 తులాల వెండిని అపహరించుకుపోయినట్లు మలక్‌పేట పోలీసులు విచారణలో వెల్లడించారు.

ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు దోపిడీకి గురికావడం పరిసర ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే మలక్‌పేట పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలను సేకరించడంలో నిమగ్నమైంది.

పోలీసులు ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తే, దొంగలు ఇంటి నిర్మాణం, నగలకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసిన వారిలా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

ఇంట్లో వస్తువుల అమరిక, విలువైన నగలు ఉన్న ప్రదేశాలను దుండగులు ఖచ్చితంగా గుర్తించడంతో, ఈ చోరీ వెనుక పరిచయస్తుల ప్రమేయం ఉందా, లేదా బయటివారి గ్యాంగ్ పని ధోరణా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద చోరీ ఇదేనని పోలీసులు చెబుతున్నారు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు మలక్‌పేట పోలీసులు తెలిపారు.

Leave a Reply