మహేంద్ర తనయ పరవళ్లు

మహేంద్ర తనయ పరవళ్లు

పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా), ఆంధ్రప్రభ : బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా నిరంతర వర్షాలతో పాతపట్నం, మెలియాపుట్టి మండలల పరిధిలో అనేక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా పాతపట్నం నుంచి కే.గోపాలపురం, హెచ్.గోపాలపురం H.Gopalapuram) వెళ్లే రహదారి మార్గంలో కాజ్ వే పై మహేంద్ర తనయ ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తోంది.

నదీ ఉప్పొంగి రహదారిని ముంచెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. నదీ ప్రవాహం తగ్గే వరకూ ఈ మార్గంలో ప్రయాణం చేయవద్దని గ్రామస్తులను అధికారులు హెచ్చరిస్తున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి మధ్య ఎగువనున్నచెరువులు పొర్లిపొంగడంతో తిడ్డిమి(Tiddimi) ప్రాంతం వద్ద ఇరువైపులా పొలాలపై నుంచి నీరు రహదారిపైకి ప్రవహిస్తోంది. ఫలితంగా రహదారి పూర్తిగా నీట మునిగి, వాహనాలు, ద్విచక్ర వాహనాలు కూడా కదలలేని స్థితి ఏర్పడింది.

సిరియాఖండి(Syriakhandi) సమీపంలో రహదారి నీటమునిగిపోవడంతో ప్రజలు రెండు వైపులా ఇరుక్కుపోయారు. అత్యవసర పనుల కోసం వెళ్ళే వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ప్రయాణం చేయడం ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పాతపట్నం(Pathapatnam), మెలియాపుట్టి మండలాల తహసీల్దార్, పోలీసు(Police) అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రోడ్లు మునిగిన ప్రాంతాల్లో ఎవరూ ప్రయాణం చేయవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వచ్చే కొన్నిరోజులు ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాబట్టి ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు వెళ్లవద్దని, వరద ముంపు ప్రాంతాల్లో రాకపోకలు నివారించాలని సూచించారు.

Leave a Reply