ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సామాజిక అసమానతలను తొలగించడమే మహాత్మా జ్యోతి బా పూలే ఆశయమని, పూలే ఆశయాలు, ఆలోచనలను ప్రతీ ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. అంతకంటే ముందు పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు కూచిపూడి నృత్యం ప్రదర్శన చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జె.రంగా రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
