గుంటూరు: మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించారు వైసీపీ అధినేత, మాజీ మఖ్యమంత్రి జగన్. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదని.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందన్నారు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది..? అని నిలదీశారు. తాడేపల్లిలోని తన నివాసంలో నేడు జరిగిన వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగమే ..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని మండిపడ్డారు జగన్. వైఎస్సార్‌సీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష్య సాధింపు రాజకీయాలను ప్రస్తావిస్తూనే కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయని అంటూ, హత్యకు ఉపయోగించిన వాహనం ఎవ్వరిదో తెలుసు, చంపిన వాళ్లు ఎవ్వరో తెలుసు, టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని స్వయంగా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు తమ పార్టీ ఇన్‌ఛార్జి పిన్నెల్లి మీద కేసులు పెట్టారన్నారు.
ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే.. తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్లు పెట్టి మాజీ మంత్రి కాకాణిని అరెస్టు చేశారన్నారు. టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు ఆర్కేమీద కేసు పెడుతున్నారని, ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోందని అన్నారాయన.

రిటర్న్ గిఫ్ట్ తప్పదు
ఈసారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తాం. చేసినవాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారిని కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫాం ఇచ్చింది అని జగన్ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు..
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని, అయితే చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన అని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదని పేర్కొన్నారు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని అంటూ దాని ప్రతిఫలమే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు జగన్.
