మహా చావు మేళ

- బర్త్ డే పాప, తల్లీ సహా
- 15 మంది దుర్మరణం
- కుప్పకూలిన భారీ భవనం
ఆంధ్రప్రభ, ముంబై : పుట్టిన రోజు వేడుకల్లో (birthday celebrations) బంధువులందరూ ఖుషీఖుషీగా ఉన్నారు. హ్యాపీ బర్త్ డే కేరింతలు మార్మోగాయి. అంతలోనే మృతువు విరుచుకుపడింది. హ్యాపీ బర్త్ డే బిడ్డ, తల్లీ సహా 15 మందిని మింగేసింది. ఈ హృదయ విదారక విషాదకర దుర్ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా విరార్ ప్రాంతంలోని చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయ్‌నగర్ (Vijaynagar) లో రమాబాయి అపార్ట్ మెంట్ లోని ఒక బ్లాక్ కుప్ప కూలిపోయింది. నాల్గవ అంతస్తులో పుట్టిన రోజు పార్టీ జరపుతుండగా ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ప్లాటులో నివసిస్తున్న జోవిల్ కుటుంబం (Jovill family) తమ కుమార్తె మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఏడాది పాప ఉత్కర్ష్ ఓంకార్ జోవిల్ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఇక ఆరోహి (23)అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్ఘర్ జిల్లాలోని ఉన్న విరార్ ప్రాంతంలో ఈ మధ్య అనేక భవనాలు కూలిపోవడం సాధారణంగా మారింది. నిర్మాణ నాణ్యత, గృహ భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషాదం నేపథ్యంలో ప్లాట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరుకుంటున్నారు.
నాలుగు అంతస్తుల భవనంలో 50 ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భవనంలోని నాలుగో అంతస్తులో ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకలు (Birthday celebrations) జరుపుకుంటుండగా భవనం కూలిపోయింది. 12 ప్లాట్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. నివాసితులు, అతిథులు శిథిలాల్లో చిక్కుకుపోయారు. పాల్‌ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇండు రాణి జాఖర్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా ఎవరైనా శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో ఎన్ డిఆర్ఎఫ్, రెస్య్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయని కలెక్టర్ (Collector) తెలిపారు. ఈ దుర్ఘటనలో గోవింద్ సింగ్ రావత్ (28), శుభంగి పవన్ సహేని (40), కషిష్ పవన్ సహేని (35), దీపక్ సింగ్ బెహ్రా (25), సోనాలి రూపేష్ తేజాం (41), హరీష్ సింగ్ బిష్ట్ (34), సచిన్ నేవల్‌కర్ (40), దీపేష్ సోని (41) మృతి చెందారు. మరో ఏడుగురిని గుర్తించే పనులో అధికారులు బిజీబిజీగా ఉన్నారు.
