భారత ప్రముఖ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మకావ్ ఓపెన్ 2025లో విజయం సాధించి రెండవ రౌండ్‌కి చేరారు. మలేషియాకు చెందిన లో హాంగ్ యీ – ఎన్‌ జె ఎంగ్ చెయాంగ్ జోడీపై వీరు 21-13, 21-15 తేడాతో కేవలం 36 నిమిషాల్లోనే గేమ్ ముగించారు.

ఇప్పుడు ఈ జోడీ జపాన్‌కు చెందిన కకేరు కుమాగాయి – హిరోకి నిషి జోడీతో రెండవ రౌండ్‌లో తలపడనున్నారు.

ఇక మరోవైపు, భారత టాప్‌ సీడ్ మహిళల డబుల్స్ జోడీ త్రీస జాలీ – గాయత్రీ గోపిచంద్ తొలిరౌండ్‌లోనే టోర్నమెంట్‌కు వీడ్కోలు పలికారు. చైనీస్ తైపేకు చెందిన లిన్ జియావో మిన్ – పెంగ్ యూ వెయ్ జోడీ చేతిలో 21-16, 22-20, 21-15 మూడు గేమ్‌ల తేడాతో ఓడిపోయారు.

బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10కి సాత్విక్-చిరాగ్..

ఆసియా గేమ్స్ బంగారు పతక విజేతలు సాత్విక్సైరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మరోసారి BWF పురుషుల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించారు. గత వారం చైనా ఓపెన్‌లో సెమీఫైనల్స్ చేరడంతో వారు మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నారు.

ఈ భారత జోడీ ఇప్పటికే ఈ సీజన్‌లో సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్‌ల్లో సెమీఫైనల్‌ వరకు చేరిన ఘనతను సాధించింది. గత సంవత్సరం థాయిలాండ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని ఒకదశలో వరల్డ్ నెం.1 స్థానాన్ని కూడా అందుకున్నారు.

పురుషుల సింగిల్స్‌లో రెండు స్థానాలు ఎగబాకిన‌ లక్ష్య సేన్ , హెచ్‌ఎస్ ప్రణయ్

పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ లక్ష్య సేన్, 54,442 పాయింట్ల‌తో రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానంకి చేరుకున్నారు. చైనాకు చెందిన జెన్‌షియాంగ్ వాంగ్ ఐదు స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరారు. ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా రెండు స్థానాలు మెరుగుపరచుకొని 33వ ర్యాంక్కి చేరారు (40,336 పాయింట్లు).

ఉన్నతి హూదా సంచలనం – మహిళల సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్

17 ఏళ్ల ఉన్నతి హూదా మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 31వ ర్యాంక్ సాధించారు. గత వారం ఓలింపిక్ డబుల్ మెడలిస్ట్ పీవీ సింధుపై సంచలన విజయం సాధించిన ఆమెకు ఇది గణనీయమైన మైలురాయి. పీవీ సింధు ప్రస్తుతం 15వ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నారు, ఇది మహిళల సింగిల్స్‌లో భారత తరఫున అత్యున్నత ర్యాంక్.

మహిళల డబుల్స్‌లో స్థిరంగా త్రీసా-గాయత్రీ, అభివృద్ధి చెందిన క్రాస్టో-అశ్విని

మహిళల డబుల్స్ విభాగంలో, భారత టాప్ జోడీ త్రీసా జాలీ – గాయత్రీ గోపిచంద్ 11వ ర్యాంక్ వద్ద స్థిరంగా కొనసాగుతున్నారు. మరోవైపు తనిషా క్రాస్టో – అశ్వినీ పొన్నప్ప జోడీ రెండు స్థానాలు మెరుగుపడి 45వ ర్యాంక్కి చేరారు.

Leave a Reply