Lucky draw | లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ రెడ్డి..

Lucky draw | లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ రెడ్డి..
- బూతుల సీఎం రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలి
- సింగరేణినీ బామ్మర్దితో కలిసి దోచుకుంటున్నారు
- అభయ హస్తం కాదు .. భస్మహస్తం
- అధికారం ఎవరికి శాశ్వతం కాదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Lucky draw | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : లక్కీ డ్రాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బూతులు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎలెక్షన్ కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 420 దొంగ హామీలను నమ్మి భూపాలపల్లి ప్రజలు ఎర్రని ముఖాన్ని కాదు, నల్లని ముఖాన్ని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేస్తే, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశామని, డబుల్ బెడ్ రూమ్లు, సింగరేణి క్వార్టర్లు కట్టామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ జిల్లాను తెచ్చాడా తీసివేయడానికి, మేడారంలో కమిషన్లు వేశారని ఏ జిల్లాను తీసేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Lucky draw | సింగరేణిని బామ్మర్దికి కట్టబెట్టారు…
సింగరేణిని దోచుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన బావమరిదికి సింగరేణిని కట్టబెట్టి రూ.6 వేల కోట్ల స్కాం చేశారన్నారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న సింగరేణి గత రెండేళ్లలో పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిందన్నారు. సింగరేణి బొగ్గు గనుల స్కామ్‌పై సాక్ష్యాధారాలతో బయటపెట్టామని, అయినా ఇప్పటివరకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సాక్ష్యాలు ఉన్న వరుణ్ షిప్ ల్యాబొరేటరీని అగ్నికి ఆహుతి చేశారని ఆరోపించారు. తమ పాలనలో సింగరేణిలో 19 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.

Lucky draw | అభయ హస్తం కాదు… భస్మ హస్తం..
కాంగ్రెస్ అభయ హస్తం కాదని, భస్మ హస్తమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తులం బంగారం, రూ.4 వేల పెన్షన్, రైతు బంధు, బతుకమ్మ చీర, విద్యార్థులకు స్కూటీ, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, ఏ హామీని అమలు చేయలేదన్నారు. రైతులకు యూరియా కూడా దొరకడం లేదని ప్రశ్నిస్తే పాలన చేతకాక మొఖం బాగా లేక అద్దాలు పగలగొట్టుకునే స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నడపలేక మాజీ సీఎం కేసీఆర్‌ను అడ్డగోలుగా తిడుతూ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాంటి మాట తీరు ఉన్న ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరన్నారు.
Lucky draw | అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
సీఎం మాటల ప్రభావంతో కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్షాలు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అలాంటి అధికారుల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.
రెండేళ్లలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమిటి?
గత ఎన్నికల్లో సానుభూతితో గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే రెండేళ్లలో భూపాలపల్లి పట్టణానికి ఏం చేశాడని ప్రశ్నించారు.
Lucky draw | సంక్షేమ పథకాలు రానివారే కారు గుర్తుకు ఓటేయాలి..
మోడీ పంపిన రూ.15 లక్షలు అందితే బీజేపీకి ఓటు వేయాలని, రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ వచ్చినవారు చేయి గుర్తుకు ఓటేయాలన్నారు. ఇవేవీ రాని భూపాలపల్లి 30 వార్డుల ప్రజలు కారు గుర్తుపై ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు ,కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
