ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో.. పంజాబ్ బ్యాటర్లు తమ పవర్ హిట్టింగ్‌తో లక్నో నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే ఛేదించారు. దీంతో టోర్నీ వరుసగా రెండో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి ఎగబాకారు.
కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జేయింట్స్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. అనతంరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 69), కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (30 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సులతో 52* నాటౌట్) అర్ధ శతాలతో చెలరేగారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ నేహాల్ వధేరా ( 25 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులతో 43) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లో దిగ్వేష్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.