హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మరింత బలపడి ఒడిశా వైపు కదులుతోందని, దీని ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో..

నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు. వాతావరణ శాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని, బయటకు వెళ్లినపుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఇక గత రెండు రోజులుగా తెలంగాణను ముంచెత్తిన వర్షాలు శుక్రవారం కాస్త విరామం తీసుకున్నాయి. నాలుగైదు రోజులుగా కుండపోత వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న హైదరాబాద్‌లో ఆకాశం శుక్రవారం మేఘావృతంగా ఉన్నప్పటికీ, వర్షం మాత్రం పడలేదు.

Leave a Reply