కాస్త గంజి నీళ్లు పోయండి
ఇది ఓ తాపీ మేస్త్రి కన్నీటి గాథ
(అర్ధవీడు, ఆంధ్రప్రభ) : వారి చమట చుక్కల ధారలు కాంతులీనుతున్న భవనాలెన్నింటినో నిర్మించాయి. చెయ్యి తిరిగిన వారి మెళకువలు.. ఆహ్లాదకర ఆకృతులతో గృహావరణాలను సృజించాయి. తూట్లు పడిన ఆ అరిచేతులు, ముక్కలైన వారి రెక్కలు, కరిగిన ఆ కండలు.. కోటలాంటి గోడలను నిర్మించి సౌదాలను అందించాయి. అన్నిటికి మించి భద్రతకు బాసటై నిరంతర రక్షణనిస్తున్నాయి. ఇందుకోసం తమ యావత్ శ్రమపు ధారబోసిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు కష్టాల కడలిని ఈదుతున్నాయి. అనారోగ్యానికి గురై అర్ధాయుష్షుతో ముగుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆత్మగౌరవంతో బతికే స్థితి నుండి అనారోగ్యాలకు గురై..ఆకలి తీర్చమని సాయం కోసం ఆర్ధించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఒక దీన గాథ కలిగినదే తాపీ మేస్త్రీ రెడ్డిచర్ల శేషులు (reddycherla seshulu) కుటుంబం.
శేషులు అర్థవీడు నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తాపీ మేస్త్రిగా శ్రమను నమ్ముకుని బతుకు బండి లాగుతున్నాడు. ఆయన భార్య శ్రామికురాలే. దినసరి కూలి చేస్తూ భర్తకు చేదోడుగా ఉంటుంది. దిన దినం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరంతరం దొరకని పనులు, అనారోగ్య సమస్యలు (Health problems), ఎదుగుతున్న పిల్లల చదువులు, వారి అవసరాలు తీర్చుకుంటూ.. సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కూతురి వివాహం చేసి ఒక భాద్యత నెరవేర్చారు. ఇక కుమారున్ని స్థిర పరచి ఒక ఇంటి వాన్ని చేసి శ్రమ నుండి విముక్తి పొందాలనుకున్నారు. ఆ సమయంలోనే చక్కెర వ్యాధి శేషులును మహమ్మారిలా పట్టింది. రోజుల పేరిట ఒంట్లో సత్తువను గుంజేయడం మొదలెట్టింది.
అయినా వీడు పని చేయడం ఆపలేదనుకుందేమో ఆ మహమ్మారి! ఏకంగా శేషులు కంటి చూపు క్షీణించేలా చేసింది. పరీక్ష చేయించగా శేషులు కంటి చూపు 80శాతం కోల్పోయాడని ప్రయివేట్ వైద్యులు నిర్ధారించారు. దీంతో పని చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆదాయం పడిపోయింది. కుటుంబ భారం శేషులు భార్యపై పడింది. సంసారం అనే శరీరానికి ఒక చేయి పడిపోయినట్లయింది. ఒంటి చేత్తో సంసార భారాన్ని మోస్తున్న ఈ క్రమంలోనే ఆమెకు గుండె నిమ్ము సోకింది. తీవ్ర ఆయాసంతో బాధ పడుతోంది. దీంతో ఆమె కూలి పనికెళ్లి సంపాదించే స్థితిని కోల్పోయింది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. దీంతో కుటుంబ భారం చిన్న వయసుకుడైన వారి కొడుకు మీద పడింది. ఒక వైపు తన తండ్రి కంటి చూపు కోల్పోయి నిశ్చేస్టుడయ్యాడు. మరో వైపు తన తల్లి అనారోగ్యానికి గురైంది. మరో వైపు తల్లిదండ్రులు తన కోసం చేసిన పొదుపు సొమ్ము ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే చాల్లేదు. ఈ నేపథ్యంలో అతను హైదరాబాద్ లోని ప్రయివేట్ కంపెనీలో దినసరి కూలిపై పని కుదుర్చుకున్నాడు. తద్వారా వచ్చే వేతనం నెలసరి పోషణకే చాలడం లేదు. దీంతో ఆ కష్ట జీవుల బతుకు భారంగా మారింది.
కనికరం చూపండయ్యా..
తాపీ మేస్త్రి శేషులు
కష్టం చేసి బతకాలనే ఆశ ఉంది. వయసు కూడా ఉంది. కానీ చక్కెర వ్యాధి నా సత్తువను గుంజేసింది. పైగా కంటి చూపు లేకుండా చేసింది. పనికి పిలిచే వారే లేరు. నా భార్యపై ఆధారపడి కాలం వెళదీస్తూ వచ్చా. ఆమెకు నెమ్ము చేసి ఆయాసపడుతోంది. తెలిసిన వాళ్ళు చెప్పగా మార్కాపురం సదరం కేంద్రంలో కంటి పరీక్ష చేయిస్తే 75 శాతం చూపు కోల్పోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. 2023 లో పింఛన్ కోసం ధరకాస్తు చేస్తే అర్హుడిగా గుర్తించారు. ఎలక్షన్ కోడ్ (Election Code) ఉందని నిలిపేశారు. ప్రస్తుతం కూడా దరఖాస్తు చేసుకున్నా. ఏ సంగతీ తెలీదు. బంగారు కుటుంబం లోనూ మా కుటుంబాన్ని గుర్తించ లేదు. ఇప్పటికైనా ఫించన్ ఇస్తే కాసిన్ని గంజి తాగైనా కాలం వెళదీస్తామని వేడుకుంటున్నా.