కర్నూలు బ్యూరో, జులై 22, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పున నిర్మాణ ప్యాకేజీ కింద నిర్వాసితులకు సరైన పరిహారం అందజేయడం ద్వారా పౌరుల హక్కులను పరిరక్షించడంలో ఏపీ లోకాయుక్త, ఉప-లోకాయుక్త సంస్థ మరోసారి కీలక పాత్ర వహించింది. పోలవరం ప్రాజెక్టు క్రింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ (R&R package) ప్రయోజనాల నుండి తమను మినహాయించడంపై నల్లాల వెంకటరమణమ్మ (Nallala Venkataramanamma), నల్లాల శేషగిరి (Nallala Seshagiri) దాఖలు చేసిన కర్నూల్లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కేసు నెంబర్లు 61/2019/బి1, 62/2019/బి।లలో నమోదు చేశారు.
ఫిర్యాదిదారుల నివాసాలు ప్రభావిత ముంపు ప్రాంతంలో ఉన్నప్పటికీ ఫిర్యాదు చేసిన వారిని లబ్దిదారుల జాబితాలో చేర్చలేదన్న విషయాన్ని గ్రహించారు. దీంతో ఈ విషయంలో లోకాయుక్త సంస్థ జోక్యం చేసుకుంది. తరువాత ప్రాజెక్టు నిర్వాహకుడు, ఎక్స్ ఆఫీషియో జాయింట్ కలెక్టర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ధవళేశ్వరం వారు ఫిర్యాదిదారులను సప్లమెంటరీ డ్రాస్ట్ ఆర్ అండ్ ఆర్ పథకంలో చేశారని, ఫిర్యాదిదారులకు ఇంటిస్థలం కేటాయింపుతో పాటు రూ.6,36 లక్షల నగదు, రూ.25వేల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెల్లించబడిందని నిర్ధారిస్తూ, చర్య తీసుకున్నారని నివేదికను సమర్పించారు.
ముఖ్యంగా కుమ్మరిలోన గ్రామం, తుని మండలంలోని అన్ని ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల ప్రయోజనం కోసం ప్రభుత్వం రూ.9.50 కోట్లు మంజూరు చేసింది. ఈ ఫిర్యాదు వలన ఫిర్యాదిదారులతో పాటు ఇతర ప్రభావిత కుటుంబాలకు కూడా ప్రయోజనాలు అందించబడ్డాయి. ఫిర్యాదిదారుల సమస్య పరిష్కరింపబడటంతో పి.రజని గౌరవ ఉప-లోకాయుక్త ఈ ఫిర్యాదును మూసివేస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాల హక్కులను కాపాడటంలో, పునరావాస విధానాల పారదర్శకతను అధికారులు అమలు చేయడంలో లోకాయుక్త, ఉపలోకాయుక్త సంస్థ కీలక ప్రభావాన్ని ఈ కేసు నొక్కి చెబుతుంది.