గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

library | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నంద్యాలలోని పింగళి సూరన స్మారక శాఖా గ్రంథాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారి ఆర్ఈ. శ్రీధర్, ముఖ్య అతిథులుగా సాహితీవేత్తలు, తెలుగు పండితులు అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. గ్రంథాలయ ఉద్యమ పితామహులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, గ్రంథాలయ శాస్త్ర పితామహుడైన డా. ఆర్.ఏస్. రంగనాథన్ తదితరుల చిత్రపటాలకు సాహితీవేత్తలు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానపు దారి దీపాలని మస్తక జ్ఞానం పెరగాలంటే పుస్తకమే ఆధారమని కొనియాడారు. నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రంథాలయాలు సరస్వతి నిలయాలని విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ పుస్తకం ఓ మంచి నేస్తం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, ఎస్.మున్ని, ప్రేమ జ్యోతి, సాగర్, ఆదినారాయణ, చాంద్, శర్మ, శ్రీనివాసులు, బ్రహ్మానంద రెడ్డి, ప్రదీప్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
