ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులేద్దాం..

ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులేద్దాం..
టెలీ మానస్ ద్వారా అత్యంత నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు
దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్రం సహకారంతో సేవలు అందిస్తున్న రాష్ట్రం
ఇండ్లాస్ సేవలు ప్రశంససనీయం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషిచేద్దామని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి భరోసా కల్పించే వివిధ కార్యక్రమాలతో పాటు వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ లో ఇండ్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాలులో ‘అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తొలుత మంత్రి, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, డా.ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులతో కలిసి మెంటల్ హెల్త్ వాక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లతో ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది వివిధ రకాల మానసిక రుగ్మతలకు గురైనట్లు వెల్లడించారు. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఏటా ట్రిలియన్ డాలర్లు మేర నష్టం వాటిల్లుతోందన్నారు.

ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారని.. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యాంటీనటల్ యాంగ్జైటీ డిజార్డర్‌కు 14-24 శాతం మంది గురవుతున్నట్లు తెలిపారు. మానసిక రుగ్మతలు, ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయన్నారు. సమాజానికి వెలకట్టలేని వైద్యసేవలందిస్తున్న మానసిక వైద్యులు, క్లినికల్ సైకాలజిస్తుల కొరత వుందని, ఆ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. ఇండ్లాస్ హాస్పిటల్‌లో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభమైనట్లు మంత్రి తెలిపారు.
టెలీ మానస్‌తో మానసిక ఆరోగ్య సేవలు
ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో టెలీ మానస్ ద్వారా మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలోనూ మెంటల్ హెల్త్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా 27 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఇస్తే మన రాష్ట్రానికి ఒక కేంద్రం వచ్చిందని, విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అప్‌గ్రేడ్ అయిందన్నారు. మానసిక ఆరోగ్య రంగంలో నిపుణుల కొరత తీర్చేందుకు కోర్సులు, ప్రవేశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సకాలంలో మానసిక రుగ్మతలను గుర్తించి.. సరైన చికిత్స అందించడం ముఖ్యమని, ఈ దిశగా సమష్టి కృషి, భాగస్వామ్యం అవసరమని, మానసిక వైద్య రంగంలో డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని, ఆయన అనుభవాన్ని, సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ..స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్ర కీలకమని, ప్రజలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహించిందని తెలిపారు. సదస్సుకు అధ్యక్షత వహించిన డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఇండ్లాస్ డైరెక్టర్ డా. విశాల్.. ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతుండటానికి కారణాలు, వాటిని ఎదుర్కొంటూ ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తాము ఈ రంగంలో ప్రామాణిక వైద్య సేవలు అందించే దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. వి.రాధికారెడ్డి, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా. శ్రీహరిరావు, లండన్‌కు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్ డా. కృష్ణారెడ్డి, కంటి వైద్య నిపుణులు డా. ఇండ్ల స్వప్న, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఐఎంఏ – విజయవాడ అధ్యక్షులు డా. హనుమయ్య, పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
