వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
- కోటి సంతకాలు సేకరణ పూర్తయ్యాక గవర్నర్‌కు అందజేస్తాం
-మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు…
శ్రీకాకుళం, అక్టోబర్ 24(ఆంధ్రప్రభ): వైద్య విద్యను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయవద్దని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. , పీపీపీ విధానంతో ప్రభుత్వం తన అధికారాలను కోల్పోయి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాలకు దాసోహం కావడం ఎంత మాత్రం భావ్యంగా లేదని, ఈ విధానంలో ఫ్రీ సీట్లు (కన్వీనర్ కోటా) పెరుగుతాయని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. పట్టణంలోని హయాతినగరం, అవని స్కూల్ ఆఫ్ నర్సింగ్ (విశాఖ బీ కాలనీ – శ్రీకాకుళం నగరం)లో కోటి సంతకాల సేకరణ- రచ్చబండ కార్యక్రమం వైసీపీ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మట్లాడారు. వైద్య విద్యను, వైద్యాన్నీ ప్రజలందరికీ అందించాలని 17 మెడికల్ కాలేజీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళినా ఉచితంగా వైద్యం అందేది. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,. ఇప్పుడు వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారని మండిపడ్డారు. వైద్యం ప్రభుత్వ పరంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలని ఏర్పాట్లు చేస్తే, టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరించాలని, రాష్ట్ర గవర్నర్‌కు అందించాలని సంబంధిత కార్యాచరణ చేపట్టిందని వివరించారు.
వైద్యం ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టి పీక నొక్కేయవద్దని,. మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు అందుబాటులో వైద్య విద్య ఉండాలన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి వైద్య కళాశాలను (బోధనాస్పత్రులను) ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సాధు వైకుంఠ రావు, చీమల తారకేష్, అలాబోయిన అప్పన్న, శ్రీనివాస్ పట్నాయక్, కామేశ్వరి, భరద్వాజ్, గాంధీ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

