చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామ పరిసరాలలో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఊరికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన కొందరులు యువకులకు చిరుత కనిపించడంతో వారు గ్రామ ప్రజలకు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యారు. రాచకొండ అటవీ ప్రాంతంలో పులులు, ఇతర జంతువులు తిరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీస్ లు, సిబ్బంది వెంటనే దేవలమ్మ నాగారం గ్రామానికి చేరుకొని, చిరుత సంచరించిన ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్నట్లుగా వారికి కనిపించింది చిరుతనేనా లేక హైనా నా అనే కోణంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

