చిరుత మృతి….

నంద్యాల బ్యూరో, అక్టోబర్ 15 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal district) శ్రీశైలం జలాశయం పాతాళగంగ మెట్లదారిలో పాత కళ్యాణ కట్ట వద్ద చిరుత మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అక్కడున్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

గత కొద్ది రోజుల కాలంలో ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) సమీపంలోనూ పాతాళగంగ మెట్ల వద్ద రాత్రివేళ భక్తులకు ఈ చిరుత పులి కనిపించిందని భక్తులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో సున్నిపెంట తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఆహారం కోసం ఇళ్ల మధ్యకు వచ్చిన సంఘటనలున్నాయి. రాత్రి సమయాల్లో కుక్కల కోసం కూడా ఇవి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

నల్లమల్ల అటవీ ప్రాంతం (Nallamalla forest area) దగ్గరగా ఉండడంతో అడవిలో నుంచి చిరుతలు, ఎలుగుబంట్లు, పులులు గ్రామాల్లోకి సంచరించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అయితే చిరుత పులి మరణానికి కారణాలు ఏమై ఉంటాయి.. అది ఎలా మరణించిందన్న విషయాలను పోస్ట్ మార్టం ద్వారా తెలుసుకుంటామని అటవీశాఖ ఫారెస్ట్ రేంజర్ పరమేష్ తెలిపారు.

Leave a Reply