Legislators | సింగరేణిలో మారుపేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలి

Legislators | సింగరేణిలో మారుపేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలి
- అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గళం
Legislators | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వ్యాప్తంగా మారుపేర్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించారు. సింగరేణి వ్యాప్తంగా వందలాది మంది కార్మికుల పిల్లలు మారుపేర్లు, విజిలెన్స్ (Vigilance) విచారణల పేరుతో ఉద్యోగాలు రాక తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు దూరమవడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఈ సమస్యను మొదటి నుంచే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, దీనిపై స్పష్టమైన పరిష్కారం దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతుండటం ఆందోళనకరమని ఎమ్మెల్యే (MLA) పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మారుపేర్ల బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ అంశంపై సత్వర నిర్ణయాలు తీసుకునేలా తనవంతు పూర్తి కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
