Layoffs| ఐటి కి గ‌డ్డుకాలం – దిగ్గ‌జ కంపెనీల‌లో ఉద్యోగులు తొల‌గింపు

న్యూ యార్క్ – టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటం, దానికితోడు కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తాజాగా మరోసారి వందల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. ఈ పరిణామాలు టెక్ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్ప‌టికే 61 వేల మంది ఇంటికి..

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 130 టెక్ కంపెనీలు కలిసి దాదాపు 61,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 13న మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడటానికీ, కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ లక్ష్యాలను చేరుకోవడానికీ ఈ కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, ప్రముఖ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ కూడా ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక గూగుల్ ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. వినియోగదారుల సేవలను మెరుగుపరచడం, సంస్థాగత పునర్‌నిర్మాణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. అమెజాన్ కూడా తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ఈ నెలలో వంద మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది.

ఏఐతో ఉద్యోగాలకే ఎసరు.. ఆందోళనలో ఇంజినీర్లు
కేవలం కోడింగ్ వంటి పనులే కాకుండా కృత్రిమ మేధపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగాలకు కూడా ముప్పు తప్పడం లేదన్న వాదనలకు మైక్రోసాఫ్ట్‌లో జరిగిన తాజా పరిణామం బలం చేకూరుస్తోంది. ‘బ్లూమ్‌బెర్గ్’ కథనం ప్రకారం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో ఇటీవల మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో 40 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఉన్నారు. వీరిలో కొందరిని కొద్ది నెలల క్రితమే ఏఐ టూల్స్‌పై ఆధారపడి పనిచేయాల్సిందిగా కంపెనీయే సూచించడం గమనార్హం.

అయితే, కాలక్రమేణా వారి ఉద్యోగ బాధ్యతలను కృత్రిమ మేధే సమర్థంగా నిర్వర్తించడంతో యాజమాన్యం వారిని తొలగించింది. దీంతో, తమకు తెలియకుండానే తమ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రత్యామ్నాయాలకు తామే శిక్షణ ఇచ్చామా అన్న ఆవేదన ఆ ఇంజినీర్లలో వ్యక్తమవుతోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ తమ సంస్థలో కోడింగ్ పనుల్లో మూడో వంతు కృత్రిమ మేధే పూర్తిచేస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు టెక్ రంగ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Leave a Reply