అదుపులో శాంతిభద్రతలు

అదుపులో శాంతిభద్రతలు

  • “గణపతి” లొంగిపోయేది అతనే చెప్పాలి
  • తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి
  • రూ.12. 29 కోట్లతో పోలీస్ క్వార్టర్స్ ప్రారంభం

గోదావరిఖని, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి డోకా లేదని పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం డిజిపి శివధర్ రెడ్డి రామగుండం కమిషనరేట్ ఏరియాలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రూ. 12.29 కోట్లలతో నిర్మాణం చేసిన ఆర్మీ రిజర్వుర్ పోలీస్ క్వార్టర్స్ ను డిజిపి ప్రారంభించారు.

అనంతరం డిజిపి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై స్పెషల్ ఫోకస్ చేసినట్లు డిజిపి శివధర్ రెడ్డి వివరించారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమం గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తున్నామని డిజిపి స్పష్టం చేశారు.

గణపతి లొంగిపోయేది అతనే చెప్పాలి..

తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మావోయిస్టు అధినేత ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు ఎప్పుడు అని మీడియా అడగగా…. ఎప్పుడు నుండి లొంగిపోతాడో తెలియదనీ…. అది గణపతి చెప్పాలని డిజిపి చెప్పారు. డిజిపి వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, పెద్దపెల్లి డిసిపి భూక్యా రామ్ రెడ్డి, జగిత్యాల ఎస్పీ, సిరిసిల్ల ఎస్పీ , గోదావరిఖని ఏసిపి మడత రమేష్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply