చెరువు గండి ఓ మిస్టరీ

కళత్తూరులో కన్నీటి వరద ..ఇళ్లలో నీరు, పంటలు నాశనం.. దక్కిన జనం ప్రాణాలు
ఆంధ్రప్రభ, కేవీబీ పురం (తిరుపతి జిల్లా )
తిరుపతి జిల్లా కేవీబీ.పురం మండలం ఒళ్లూరు చెరువు గండిపడటంతో కళత్తూరు, రాజులకండ్రిగ, పూడి, పాతపాలెం గ్రామాలు ఒక్కసారిగా ముంపులో చిక్కుకున్నాయి. నిన్న నిండు కుండగా ఉన్న చెరువు ఉదయం నాటికి పూర్తిగా ఖాళీ కావడంతో వందల ఎకరాల వరి, టమోటా, మిర్చి పంటలు నీటిలో కలిసిపోయాయి.
వరద నీరు గ్రామంలోకి దూసుకెళ్లి ఇళ్లలో చేరడంతో ప్రజలు ఆందోళనలో మునిగిపోయారు. పిల్లల్ని మేడలపైకి ఎత్తుకొని పరుగులు తీస్తున్న తల్లులు, పశువుల కోసం విలపిస్తున్న రైతులు, వస్తువులు కోల్పోయిన గృహిణులు ప్రతి ఇంటి ముందు ఒక విషాదకథ. ఆస్తి కోల్పోయిన బాధతో కన్నీరు పెట్టుకున్న ప్రజలు జీవితంలో ఇలాంటిదేమీ చూడలేదు అంటున్నారు.
వాహనాలు, పశువులు వరదలో కొట్టుకుపోయాయి. పాఠశాల పుస్తకాలు, గృహోపకరణాలు నీటిలో తేలుతున్న దృశ్యం మానవ హృదయాన్ని కదిలిస్తోంది. చిన్నారుల ఏడుపు, వృద్ధుల ఆవేదనతో కళత్తూరు గ్రామం ఇప్పుడు మౌన శోకంలో మునిగిపోయింది.

గ్రామస్థుల మాటల్లో ఈ ప్రమాదం రాత్రి జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎంతో పెద్దదై ఉండేది. దేవుడి దయతో పగలు సమయంలోనే జరిగింది అని ఊపిరి పీల్చుకున్నారు.
ఇక రోడ్లన్నీ కాజ్‌వేలు ముంచెత్తడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కళంగి నది ఉధృతంగా పొంగిపోతోంది. ప్రజలు వాగులు, వంకలు దాటకూడదని పుత్తూరు సీఐ హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసులు, ఫైర్ సిబ్బంది గ్రామంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఎంపీ గురుమూర్తి స్పందించి ముంపు గ్రామాలకు రూ.20 లక్షల ఎంపీ నిధులను విడుదల చేశారు. తిరుపతి నుండి ఆహార పదార్థాలు, తాగునీటి బాటిల్స్‌తో లారీలు బయలుదేరాయి. కళత్తూరు ప్రజలకు అన్నివిధాలా సహాయం అందించాలి అని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలావుంటే, ప్రజల్లో ఒక్క ప్రశ్న మారుమ్రోగుతోంది గత భారీ వర్షాల్లో చెరువు గండిపోలేడు గండి పడిందా … లేక గండి కొట్టారా ? – చెరువు గండి వెనుక మిస్టరీపై చర్చ జరుగుతుంది,గతంలో 20 లక్షల రూపాయలతో చేసిన చెరువు మరమ్మత్తు పనులు నాణ్యతా లోపంతో జరిగాయా అన్నది ఇప్పుడు విచారణకు దారి తీస్తోంది.పంటలు, ఇళ్లు, పశువులు అన్నీ కోల్పోయిన రైతుల కళ్లలో నిస్సహాయత మెదులుతోంది. ఏళ్ల తరబడి కష్టపడి పండించిన పంట క్షణాల్లో మట్టిలో కలిసిపోయింది. ఎవరైనా మాపై చేయి వేసి ఆదుకోవాలి” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
