అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు..
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో వారోత్సవాలను అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి హారీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో, కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, మహిళల సాధికారత, భద్రత, విద్యార్థుల అవగాహన లక్ష్యంగా మహిళా పోలీసు విభాగం ఆధ్వర్యంలో వారాంతర కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

మహిళలు, విద్యార్థులు, చిన్నారులు చైతన్యవంతులు కావాలని, సమాజ ప్రగతికి మహిళల పట్టుదల, ఆత్మవిశ్వాసం బలమైన పునాదులని వివరించారు. వారాంతర కార్యక్రమాల భాగంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు, పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, హెల్త్ క్యాంపులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్ షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. అలాగే డయల్ 112, చైల్డ్ లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

అవగాహన ర్యాలీ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమై కోల్స్ కళాశాల మీదుగా పాత కంట్రోల్ రూమ్ వరకు చేరి, అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది. “ఆకతాయిల ఆట కట్టిస్తాం – తిరుగుబోతుల తాట తీస్తాం”, “ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? శక్తి యాప్ వినియోగించండి” అనే నినాదాలతో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐలు రామయ్య నాయుడు, విజయలక్ష్మీ, పట్టణ సీఐలు పార్థసారథి, నాగరాజారావు, మన్సురుద్దీన్, ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు, శక్తి టీం మహిళా పోలీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మీ, చైతన్య, కెవిఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
