Kurnool | రైతులకు భరోసా కల్పించిందే కూటమి ప్రభుత్వం.

Kurnool | రైతులకు భరోసా కల్పించిందే కూటమి ప్రభుత్వం.

  • రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం
  • కలుగట్ల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

Kurnool కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను కాపాడుతూ భరోసా కల్పిస్తోందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కలుగట్లలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో రైతులు తమ పొలాలకు వెళ్లినా సరిహద్దు రాళ్లపై వైసీపీ నాయకుల ఫోటోలు కనిపించేవని విమర్శించారు. దీంతో పొలం రైతుదా, నాయకులదా అనే భయం నెలకొనేదని అన్నారు. ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తూ రైతులకు ధైర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు తమ ఆస్తులను కాపాడుకునే నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని పేర్కొన్నారు.

వ్యవసాయానికి భారీ నిధులు…

గత టీడీపీ పాలనలో వ్యవసాయ రంగానికి రూ.71 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అయితే వైసీపీ పాలనలో రూ.31 వేల కోట్లు మాత్రమే కేటాయించగా, అందులో సగం నిధులు అవినీతికి గురయ్యాయని ఆరోపించారు.

హంద్రీ-నీవా పనులు వేగవంతం…

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పూర్తి చేయలేని హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసే దిశగా ముందుకు సాగిందని మంత్రి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు కీలకమని పేర్కొన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌పై విమర్శలు…

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదని మంత్రి విమర్శించారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాతే ఆ ప్రాజెక్టును గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించి 2020 ఏప్రిల్ 20న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) స్టే ఆర్డర్ జారీ చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం 2020 అక్టోబర్ 29న పనులు నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ వాటిని పట్టించుకోలేదని తెలిపారు. ఎన్‌జీటీ ఆదేశాలను లెక్క చేయకుండా పనులు కొనసాగించడంతో 2024 మార్చి 22న రూ.2.6 కోట్ల జరిమానా విధించబడిందని మంత్రి వివరించారు.

రాయలసీమ అభివృద్ధే లక్ష్యం…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply